సారా స్టివార్ట్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో ఒక చిన్న మెక్సికన్ రెస్టారెంట్‌కి వచ్చారు. ఒక సాండ్‌విచ్ కావాలని ఆర్డర్ చేశారు.
బిల్లు కట్టటానికి క్యాషియర్ కౌంటర్ దగ్గరకు వెళ్లారు. అక్కడున్న ఒక చిన్న ఎల్‌సీడీ స్క్రీన్‌లో తన ముఖం ప్రతిబింబం చూసుకున్నారు. అంతే ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి బిల్లు డబ్బులు కట్టయ్యాయి.
టిప్ ఇవ్వటానికి అదే స్క్రీన్ ముందు చేతితో చిన్న సంజ్ఞ చేశారు. ఆ టిప్ మొత్తం కూడా ఆమె అకౌంట్ నుంచి కట్ అయింది.
కేవలం ఐదు సెకన్లలో ఈ మొత్తం ప్రక్రియ పూర్తయింది. ఎక్కడా భౌతిక స్పర్శ లేదు. పైగా సారా తన మొబైల్ ఫోన్ కానీ, ఏటీఎం కార్డు కానీ వెంట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
అలాగని ఎలాంటి గుర్తింపూ చూపాల్సిన పనీ లేదు. కనీసం పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఎంటర్ చేయనక్కరలేదు.
ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ కాదు. ఈ టెక్నాలజీని ఇప్పటికే ప్రతి రోజూ లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు.
ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ చరైనాలోని ప్రధాన నగరాల్లో సాధారణ వినియోగంలోకి వచ్చేసింది.
ఈ టెక్నాలజీని ఇప్పుడు అమెరికాలో ప్రవేశపెడుతున్నారు. డెన్మార్క్, నైజీరియా వంటి దేశాల్లోనూ అమలులోకి తెస్తున్నారు.
అంటే మరికొన్ని సంవత్సరాల్లో మనందరం ఈ టెక్నాలజీనే వాడబోతున్నామా? మరైతే దీనివల్ల సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత సమస్యలు ఉన్నాయా?
తనకు అటువంటి ఆందోళనలేవీ లేవంటారు 18 సంవత్సరాల సారా స్టివార్ట్. ‘‘టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇటువంటి సాంకేతికతను ఉపయూగించే ముందు రెండోసారి ఆలోచించే సావకాశమే ఉండదని నా అభిప్రయం’’ అంటారీ యూనివర్సిటీ విద్యార్థిని.
‘‘ఇప్పటికే మన ఫోన్లు మన ముఖాలను గుర్తిస్తాయి. మన ముఖాలు ఇంటర్నెట్ అంతటా చేరిపోయాయి. అలాంటపుడు ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఎవరి భద్రతకైనా కొత్తగా ఏదైనా సమస్య తలెత్తుతుందని నేను అనుకోను’’ అని అభిప్రాయపడ్డారు.
‘‘ఇది చాలా వేగవంతమైన విధానం. సౌకర్యవంతమైనది, సురక్షితమైనది కూడా. పైగా ఫోను, ఏటీఎం కార్డు ఇంటి దగ్గర వదిలేసి వచ్చామనే ఆందోళన కూడా ఉండదు’’ అని చెప్పారు సారా.
అమెరికాకు చెందిన ‘పాప్ఐడీ’ అనే ఒక టెక్నాలజీ స్టార్టప్ సంస్థ ద్వారా ఆమె ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ విధానాన్ని వాడుతున్నారు. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో మీ ముఖం ఫొటో అప్‌లోడ్ చేయటం ద్వారా సైనప్ కావాలి. అది సంస్థ క్లౌడ్ బేస్డ్ సిస్టమ్‌లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మీ అకౌంట్‌ను మీ ఏటీఎం కార్డుకు అనుసంధానించాలి.
ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్’కు అదనంగా పాప్‌ఐడీలో లభ్యమయ్యే చేతి సంజ్ఞలతో టిప్ ఇచ్చే టూల్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. సారా స్టివార్ట్ తను ఇవ్వాలనుకున్న టిప్ మొత్తానికి కొన్ని సంజ్ఞలు సెట్ చేసుకున్నారు. థంబ్స్ అప్ సంజ్ఞతో 10 శాతం టిప్, పీస్ సంజ్ఞతో 15 శాతం, శాకా లేదా ‘హ్యాంగ్ లూజ్’ సంజ్ఞతో 20 శాతం టిప్ ఇచ్చేలా సెట్టింగ్ పెట్టుకున్నారు.
పాప్ ఐడీ ప్రధాన కార్యాలయం లాస్ ఏంజెలెస్‌లో ఉంది. అమెరికాలోని పలు నగరాల్లో, ముఖ్యంగా పశ్చిమ తీర నగరాల్లోని దాదాపు 70 శాతం స్వతంత్ర రెస్టారెంట్లు ఇప్పుడు పాప్‌ఐడీని వాడుతున్నాయి.
‘‘చెల్లింపులు చేయటానికి మీ ముఖాన్ని వాడటానికి, మీ ఫోన్‌ను వాడటానికి మధ్య ఏం తేడా లేదు అనేది మా అభిప్రాయం’’ అని పాప్ఐడీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ మిల్లర్ పేర్కొన్నారు.
‘‘పాయింట్ ఆఫ్ సేల్ వద్ద తీసుకున్న డిజిటల్ ఫొటో వెంటనే ధ్వంసమైపోతుంది. నమోదైన డాటాను ఎవరితోనూ షేర్ చేయం’’ అని ఆయన వివరించారు.
నిజానికి మొబైల్ ఫోన్ చెల్లింపులకన్నా ఈ విధానంలో చెల్లింపుల్లో వ్యక్తిగత గోప్యత ఎక్కువగా ఉంటుందని ఆయన వాదిస్తున్నారు. ఎలాగంటే మొబైల్ ఫోన్ ఎల్లప్పుడూ జీపీఎస్ ద్వారా మీ లొకేషన్‌ను ట్రాక్ చేయగలదని ఉటంకిస్తున్నారు.
పాప్ఐడీ స్టోర్ చేసే ఫొటోలు.. విశిష్టమైన ముఖ ఆకృతుల మాథమెటికల్ మ్యాప్‌లని.. నిజమైన ఫొటోగ్రాఫ్‌లు కాదని ఆయన చెప్పారు.
ప్రస్తుతం పాప్‌ఐడీ యూజర్లు తమ ఫేస్‌మాస్కుని తాత్కాలికంగా కిందికి దించాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్తులో అలా చేయాల్సిన అవసరం లేకుండా ఉండేలా సిస్టమ్‌ని అప్‌డేట్ చేస్తున్నట్లు ఆ సంస్థ చెప్తోంది.
లాస్ ఏంజెలెస్ నుంచి సుమారు 12,000 కిలోమీటర్ల దూరంలో చైనాలోని గ్వాంఝూ నగరంలో మరో విద్యార్థిని ఫేషియల్ పేమెంట్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారు. సన్ యట్ సేన్ యూనివర్సిటీలో తన వసతి ప్రాంతంలోని వెండింగ్ మెషీన్ వద్ద ఆహారం కొనుగోలు చేయాలంటే ఇదొక్కటే పద్ధతి అని లింగ్ (ఇబ్బందులు వస్తాయనే భయంతో తన అసలు పేరు వెల్లడించటానికి సిద్ధంగా లేరు) చెప్పారు.
ఈ టెక్నాలజీ వినియోగం విషయంలో లాస్ ఏంజెలెస్‌లో సారా సంతోషానికి పూర్తి భిన్నంగా ఉంది లింగ్ అభిప్రాయం. ఇది తన రోజు వారీ జీవితంలోకి మరింతగా చొచ్చుకురావటమేనని ఆందోళన చెందుతున్న ఆమె.. దీనిని వినియోగించటానికి తిరస్కరిస్తున్నారు. అందువల్ల రాత్రిపూట తాను ఆహారం కొనలేకపోయినా ఫర్వాలేదని చెప్తున్నారు.
‘‘టెక్నాలజీ అనేది ఒక కెరటం లాంటిది. దానికి ఎదురీదగలగటమనే ప్రసక్తే లేదు. కానీ నాకు సాధ్యమైనంత వరకూ నేను ఒక వైఖరిని కూడా అవలంబించాలని భావిస్తున్నా’’ అని ఆమె చెప్పారు.
టెక్నాలజీ అనేది నిజంగా ఒక కెరటం అనుకుంటే.. చైనాలో ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ టెక్నాలజీని అమలు చేయటం సునామీ వంటిదిగా భావించవచ్చు.
చైనాలో జరిగే మొబైల్ పేమెంట్లన్నీ దాదాపుగా (98 శాతం) కేవలం రెండు యాప్‌ల – అలీపే (ఈకామర్స్ జెయింట్ అలీబాబా యాజమాన్యంలోనిది), వీచాట్ పే – ద్వారానే జరుగుతున్నాయి. ఈ రెండు యాప్‌లూ దేశవ్యాప్తంగా తమ సిస్టమ్‌లలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఇన్‌స్టాల్ చేయటానికి పోటీపడుతున్నాయి.
ఇందుకోసం అలీపే రెండు సంవత్సరాల్లో 300 కోట్ల యువాన్లు (42 కోట్ల డాలర్లు) ఖర్చుపెడుతోంది. వచ్చే ఏడాది నాటికి దేశంలో 76 కోట్ల మంది ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్లను ఉపయోగిస్తారని చైనా ప్రభుత్వ మీడియా చెప్తోంది.
ఈ టెక్నాలజీ అమలులోకి రావటానికి కరోనావైరస్ మహమ్మారి దోహదపడిందని హెనాన్ ప్రావిన్స్‌లోని లూయాంగ్ ఒకేషనల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యాపకుడు వాంగ్ బింగ్ చెప్పారు.
ఇందులో ఉపయోగించే సాఫ్ట్ వేర్, కెమెరాలు చాలా అధునాతనమైనవని.. యూజర్ ఫొటోను దొంగిలించటం వంటి చర్యల ద్వారా వీటిని మాయ చేయటం అసాధ్యమని ఆయన చెప్తున్నారు. ఒకేరకంగా ఉండే కవలల మధ్య తేడాను కూడా ఈ టెక్నాలజీ గుర్తిస్తుంది.
మరి ఈ టెక్నాలజీ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ అమలవుతుందా? ప్రభుత్వాలు ఆపాలని నిర్ణయించుకుంటే తప్ప ఇది ప్రపంచమంతా అమలులోకి వస్తుందని బ్యాంకింగ్, పేమెంట్ వ్యవస్థల భవిష్యత్తు నిపుణుడు బ్రెట్ కింగ్ భావిస్తున్నారు.
ఆయన.. బ్యాంకింగ్ 4.0 అనే పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు. నిజానికి బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్ కన్నా మీ ముఖం ఖచ్చితమైన ఆకృతి, కొలతలు మరింత భద్రమైనవని ఆయన చెప్తున్నారు.
‘‘పెరుగుతున్న డిజిటల్ ఐడెంటిటీ నిర్మాణంలో ఫేషియల్ పేమెంట్లు ఒక భాగం... వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలను నేను అర్థం చేసుకుంటాను. కానీ వాస్తవం ఏమిటంటే.. భద్రత కోసం ముఖ ఆధారిత (ఫేస్-బేస్డ్) డిజిటల్ ఐడెంటిటీ నిర్మాణం అనివార్యం’’ అని ఆయన పేర్కొన్నారు.
యాపిల్ ఫోన్ల వినియోగదారులు చాలా మంది తమ హ్యాండ్‌సెట్లను యాక్సెస్ చేయటానికి ఫేషియల్ రికగ్నిషన్‌ను సంతోషంగా ఉపయోగిస్తున్నారని ఆయన ప్రస్తావించారు. ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ దీనికి కొనసాగింపు మాత్రమేనని అభివర్ణించారు.
అయితే.. అసలు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ల విషయంలోనే పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో.. అమెరికా నియంత్రణ సంస్థలు ఈ టెక్నాలజీ మీద దృష్టి సారించవచ్చునని బ్రెట్ కింగ్ చెప్పారు.
ఎఫ్‌బీఐ వంటి ఫెడరల్ ఏజెన్సీలు అనుమానిత నేరస్తులను గుర్తించటానికి ఈ టెక్నాలజీని ఉపయోగించటాన్ని నిరోధించే బిల్లులను ఈ ఏడాది మళ్లీ ప్రవేశపెట్టాలని అమెరికా కాంగ్రెస్‌లోని కొందరు డెమొక్రాట్ సభ్యులు భావిస్తున్నారు.
చైనాలోనూ యూగర్ ముస్లింలను గుర్తించటానికి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.
పాప్ఐడీ సీఈఓ జాన్ మిల్లర్ మాత్రం.. ప్రధానమైన కార్డు ప్రాసెంసింగ్ కంపెనీలతో తను చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. యాపిల్ పే, గూగుల్ పే వంటి మొబైల్ ఫోన్ యాప్‌లను అధిగమించటానికి ఈ సంస్థలు ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్‌ను ఒక మార్గంగా చూస్తున్నాయి.
అయినప్పటికీ.. ఫేషియల్ రికగ్నిషన్ పేమెంట్ ఆలోచనను కొందరు ఎప్పటికీ అంగీకరించబోరని మిల్లర్ ఒప్పుకుంటున్నారు. ‘‘జనంలో ఒక భాగం దీనిని ఎన్నడూ అంగీకరించరు. వారికి ఇదొక సైకలాజికల్ అంశం’’ అని చెప్పారు.
No comments:
Post a Comment