Friday, 21 April 2017

ఇష్టమొచ్చింది షేర్ చేయొద్దు.. ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు

ఇష్టమొచ్చింది షేర్ చేయొద్దు.. ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు

సోషల్ మీడియా స్పీడు చాలా ఎక్కువ.  ఇలా పోస్టు చేస్తే అలా ప్రపంచాన్ని చుట్టేస్తుంది. మంచైనా, చెడైనా నిమిషాల్లో స్ప్రెడ్ అయిపోతుంది. అది ఒక్కోసారి మేలు చేస్తున్నా ఒక్కోసారి మాత్రం కొంప ముంచుతోంది. సోషల్ మీడియాలో ‘ఫార్వర్డ్’, షేర్ వంటి ఆప్షన్లను కరెక్టుగా ఉపయోగించకపోతే ఎన్నో ఇబ్బందులు తప్పవు. ఇతరులకు ఇబ్బందులు కలగడమే కాకుండా ఒక్కోసారి అవి బూమరాంగ్ లా తిరిగి అవి కేసులుగా మారి మన మెడకే చుట్టుకునే ప్రమాదమూ ఉంది. అందుకే సోషల్ మీడియాలో కనిపించిందాంట్లో నిజానిజాలు తెలుసుకున్నాకే షేర్ చేయాలి. లేకపోతే ఇతరులు కానీ, మనం కానీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఇలాంటి ధోరణి వల్ల ఇప్పటికే వందలాది మంది ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నరు, మహారాష్ర్ట మాజీ సీఎం, మాజీ కేంద్ర హోం మంత్రి అయిన సుశీల్ కుమార్ షిండే కుమార్తె ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. ఆమె తప్పేమీ లేకపోయినా నిందారోపణలు ఎదుర్కొంటున్నారు. సుశీల్ కుమార్ షిండే రెండో కుమార్తె ప్రీతి ష్రాఫ్ పై తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీని కంతటికి కారణం ఆమె ఇంటిపేరు ష్రాఫ్ అని ఉండడమే. గత సోమవారం పుణెలో ఫుట్ పాత్ పై నిల్చున్న వారిని ఓ మహిళ తన కారుతో ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఆ యాక్సిడెంట్ కు పాల్పడిన మహిళ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య. ఆమె పేరు సుజాత జయప్రకాశ్ ష్రాఫ్. షిండే కూతురు ప్రీతి ఇంటి పేరు కూడా ‘ష్రాఫ్’ కావడంతో.. ఈ యాక్సిడెంటు ప్రీతి ష్రాఫ్ చేసినట్టుగా సామాజిక మాధ్యమాలు వేదికగా ఆమెపై తప్పుడు ప్రచారం జరిగింది. 

దీంతో, ప్రీతి, ఆమె భర్త మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో, ఆమెపై తప్పుడు ప్రచారానికి నెటిజన్లు స్వస్తి పలికారు. కాగా, ప్రీతి ష్రాఫ్ భర్త అయిన రాజ్ ష్రాఫ్ కాంగ్రెస్ నేత, వ్యాపారవేత్త. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, అసలు విషయం తెలుసుకోకుండా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదని, నిజానిజాలు తెలుసుకోకుండా తమపై నిందలు వేయడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment